కాఫీ విత్..‌ఆర్ రమాదేవి పొయెట్రీ..1075-ఎ.రజాహుస్సేన్

ఆర్. రమాదేవి ప్రేమ కవిత్వం రాస్తారు.‌కేవలం ప్రేమ కవిత్వం మాత్రమే రాస్తున్నారు.
రమాదేవి కవితల్ని నేను చాలానే సమీక్షించాను.అవన్నీకలిపితే ఓ పుస్తకమే అవుతుంది.
ఆ మధ్య ఓ మిత్రుడు నన్నడిగాడు. మీరు రమాదేవి కవితల్ని విశ్లేషిస్తున్నారు.‌
అసలు వాటిలో ఏముందని పడీపడీ విశ్లేషిస్తున్నారు.అది కూడా ఓ కవిత్వమేనా?
అన్నది ఆ మిత్రుడి మాట సారాంశం…

దానికి చిరు నవ్వే సమాధానంగా చెప్పాను…
నాకర్థం కాలేదన్నట్టు మొఖం పెట్టాడు..
అయితే ఒక్క మాటలో చెబుతాను వినండి అన్నాను..


“రమాదేవి గారి ప్రేమ కవితల్లో ఓ  గమ్మత్తైన…' ‘మత్తు’ వుంటుంది.
అది పూలతేనె తాగితే కలిగే పరవశం.జాగ్రత్తగా మనసు పెట్టి చదివితే
‘రస’సిద్ధి కలుగుతుంది.అది అనుభవం కంటే గొప్పది” అన్నాను‌.‌.‌
ఆ మిత్రుడికి నా సమాధానం ఏమర్ధమైందో కానీ, తలూపుతూ వెళ్ళిపోయాడు..

ఈ రోజు ఆ  మాటకు తగిన కొన్ని కవితల్ని విశ్లేషించి మీ ముందు పెడుతున్నా చిత్తగించండి..!!

"మనసు కెందుకో మెలకువ వచ్చింది
చీకటిలో తారట్లాడుతూ ఓ జ్ఞాపకం
అసహనంగా తిరుగుతోంది
అలికిడి చేయడం ఇష్టం లేక
నిదురించే కనుల ముందు
కావలి కాస్తుంది...
ఏమైనా కానీ ..
నిదురలేక ఎర్రబడిన జ్ఞాపకానికి
పంతం ఎక్కువే.. నాపై మక్కువ ఎక్కువే
కలగా  మనసు వాకిట నిలవాలని
పెంకితనం అరువు తెచ్చుకుంది
అచ్చంగా నీలాగా...."!!

ప్ప్రేమ కవిత్వంలో సహజంగానే ప్రేయసీ,ప్రియులుంటారు.ఇక్కడా అంతే.అతడంటే ఆమెకు ఎంతో ఇష్టం !
ఆమెఅతడికి ప్రాణం.ఆతగాడి తాలూకు జ్ఞాపకాల చెరలో ఆమెబందీ. ఆరోజు వున్నట్టుండీ
మనసు కెందుకో మెలకువ వచ్చింది..చీకట్లో  తారాడుతూ ఓ జ్ఞాపకం అసహనంగా అటూ ఇటు తిరుగుతోంది.
అలికిడి చేయడం ఇష్టం లేక కాబోలు నిద్రపోతున్న కళ్ళముందు కావలి కాస్తోంది.!
పాపం! జ్ఞాపకానికి రాత్రంతా నిద్ర లేదు.అందుకే జ్ఞాపకం ఎర్రబడింది.ఏమాటకామాటే చెప్పుకోవాలి.
జ్ఞాపకానికిపంతం కాస్తంత ఎక్కువే సుమా ! ఆమె మక్కువను 'కల'గా చేసుకొని,  మనసు వాకిట నిలవాలని
పెంకితనాన్ని.. అరువు తెచ్చుకుంది. అచ్చం అతడిలా..!
నిజానికి ఇక్కడ అతడు లేడు.అతడి జ్ఞాపకంమాత్రమేవుంది.జ్ఞాపకం అతడిదే కాబట్టి అతనికున్నపెంకితనం
జ్ఞాపకానికీ వుందన్నది ఇక్కడ కవయిత్రి చమత్కారం.'అతడు లేక..అతని జ్ఞాపకాలతో ఆమె సతమతమవుతూ
నిద్ర రాక కళ్ళు ఎర్రబడ్డాయన్నది అర్థోక్తి.!


ఈ కవితను ఇదే మూడ్తో  ఇంకాస్త ముందుకు
తీసుకెళ్ళారు రమాదేవి.!

'అతడు  ధ్యానంలో మౌనంగా ఉన్నాడు. ఈ సంగతి తెలిసి కూడా ఆమె పదే పదే అతడున్న  చోటుకు వెళుతూనే
వుంది. ఏమో ? ఎవరికి తేలుసు? అతడు మౌనం వీడుతాడేమో? ఏ క్షణమైనా తనది కావొచ్చేమో? అనుకుంది ఆమె..!!
కాలం నడకలో పువ్వు పూసింది.మొక్క  నవ్వింది. బండరాయి సైతం మాటలు నేర్చుకుంది.ఏమీ జరగని చోట ఏ ఆనవాళ్లు లేని చోట చిరుగాలి లాంటి జ్ఞాపకాలు ఒక్కసారిగా చుట్టుముట్టాయి.అసలీ… జ్ఞాపకాలు ఎలా వచ్చి చేరాయో తెలీదు.ఈ జ్ఞాపకాలు మనసు అనే మల్లె పందిరి తీగలకు అల్లుకుపోయి ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి…! అయితే…అతడింకా అక్కడే  ధ్యానంలోనే ఉన్నాడు. మౌనంగానే ఉన్నాడు... ఏంచేయాలో ఆమెకు పాలుబోలేదు.పదే పదే అక్కడికెళ్లి .. తన క్షణాలు కొన్ని ఇద్దామన్న తలపు ఆమెది. కానీ అదేం విచిత్రమో గానీ..అది కాస్తా కాలం మలుపులో ఆగిపోయింది ...బహుశా ఇప్పుడామె మోక్షగామి కాబోలు…అతడి మనసెందుకో మసకబారి‌ంది. ఆమె  కళ్ళు పొడిబారాయి. ఆమె నీడ ఎందుకు దారి తప్పి పోయింది…బహుశా దాచిన జ్ఞాపకాలు ఇక్కడ కథలుగా మిగిలాయేమో,? ఏమో... ?

ఈ కవితలో ఏముందని మీరడగవచ్చు.ఇద్దరు ప్రేమికుల❤️గుండె  సవ్వడి వుంది.ముఖ్యంగా అతగాడిపై..ఆమెజ్ఞాపకాల పరిమళముంది. నిజానికిది ఫీల్ గుడ్ కవిత..దీనిగురించి ఇంకాతెలుసుకోవాలంటే ప్రేమించిన హృదయాన్నడగండి..!!
ఈ కవిత మనసుకు సంబంధించింది.మనిషిని నడిపించే రిమోట్ కంట్రోల్ మనసే.అయితే ఆ మనసును కూడా కలవరపెట్టేది, నిద్రలేకుండా చేసేది ఇంకొకటి వుంది.అదే....జ్ఞాపకం.


జ్ఞాపకం ఓ పట్టాన నిలవదు.మనసు మాట అసలే వినదు.దాని పని అది చేసుకుంటూ పోతుంది.
జ్ఞాపకం చేసేగారడీమామూలుగా వుండదు. పరిపరి విధాలుగా అది చేసే తమాషా ఓ రేంజ్ లో వుంటుంది.
ఈ కవితలో వున్నతమాషా ‘ వుంది.

*అతడు..ఆమె..
ఇదో.. ప్రేమకథ..!!
ఇదో ప్రేమకథ.అంతులేని కథ‌.వాళ్ళిద్దరి కథ.ఇద్దరూ
కలిసినట్టే వుంటారు.కానీ,కలిసిన దాఖలాల్లేనేలేవు.
వాళ్ళిద్దరి మధ్య ఎడబాటు.తడబాటుతో పాటు ప్రేమ కూడా వుంది.

కాకపోతే,అది ఇంకా ఒక రూపానికి రాలేదు..ఎప్పుడొస్తుందో తెలీదు.అయితే.ప్రేమకు మార్పు….

ముగింపేదీ లేదన్నది ఈ ప్రేమ కథ పిండితార్థం..


"ఏమోయ్..!
ఓ కథ చెప్పుకుందామా?
అనగనగా ఒక ఊరు
అక్కడ
ఒక నువ్వు
ఒక నేను
మరొక నేను
ఇంకొక నేను
అలా అలా
అనేక అనేక నేను ఓ నువ్వు"!!

ఆమె అనేక రూపాలు..అతడు మాత్రం ఒక్కడే.(ఏకత్వం)అతడికోసం ఆమె నిరీక్షణ..అన్వేషణ..!

"నా చెవి లోలాకు నీ మాటకై
నా కాలిపట్టా నీ అడుగుల జాడకై
నా చేతి గాజులు నీ రాకకై
వెతుకుతుంది
నీ మౌనం తెలిసి కూడా
దరిదాపుల్లో లేని నీకోసం
నా నీడ  వేచి ఉంది...
బహుశా
నీ రంగుల జ్ఞాపకాల్లో బందీనై
నన్ను నేను మరిచానేమో"!!
             *ఆర్.రమాదేవి.!!

అతడామె ప్రియుడు.అతడంటే ఆమెకు ఎనలేని ప్రేమ.ఎంతంటే? మాటల్లో చెప్పలేనంత. ఆమె అణువణువేకాదు..చివరకు  ఒంటిమీద ధరించిన ఆభరణాలుకూడాఅతడి రాకకై ఎదురు చూస్తుంటాయట.
అతని మాట వినాలని 'చెవిలోలాకు'అతని అడుగుల జాడకోసం ఆమె ' కాలిపట్టా'అతడి రాక కోసం ఎదురు చూస్తూ 'చేతగాజులు'ఎదురు చూస్తున్నాయి.అంతే.. కాదు.అతడి మౌనం తెలిసి కూడా దరిదాపుల్లో లేని అతడికోసం ఆమె ' నీడ ' వేచి ఉంది.అంతెందుకు.?అతని రంగుల జ్ఞాపకాల్లో బందీయై తన్ను తాను మరిచిపోయింది.!

రమాదేవి..ఓ మధుర భావనను కవిత్వం చేయడంలో దిట్ట.ఈ కవిత కూడా అలాంటిదే..ప్రియసఖుడి
ఆనవాలును ఆరా తీసే సందర్భం.అతగాడి ఆనుపానులు తెలుసుకుంటూ, తన్నుతాను అతగాడి
జ్ఞాపకాల తీగకు పెనవేసుకునే  ప్రేమ ఘట్టం ఇది…మీరు కూడా ఓ సారి ఈ కవిత చదవండి..!!


“నువ్వు
ప్రేమలోని అపురూపాన్ని
చెరగనివ్వకుండా
నిలిపివుంచిన
ఓ సొగసైన అద్భుతం....
అందుకేనేమో
నీకోసం చెప్పే ప్రతిమాట
తనను తాను
అందంగా మలచుకుంటుంది..
అందుకేనేమో...ఎక్కడో
చినుకు చినుకుగా రాలినా
నాకు నేనుగా పెనవేసుకుని
నదినై నీకై వెతుకుతా....
అందుకేనేమో... మరి
నేను కాస్తంత మృదువైన
నెమలీకనే కదా అని అనుకున్నా
నీ అడుగుజాడల వెంబడే
పరుగులు తీస్తాను...
ఇంతకూ
ఎవరు నువ్వు ..
ఏ ఆకాశపు
తారాతోరణం నుండి
జాలువారావోయ్ ....”!!
*ఆర్.‌.రమాదేవి…!!


అతడు ఆషామాషీ  చెలికాడేం కాదు.ప్రేమలోని అపురూపాన్ని ఏమాత్రం చెరగనివ్వకుండా,అలాగే
నిలిపివుంచిన ఓ సొగసైన అద్భుతం కూడా,అందుకే అతగాడంటే ఆమెకు అంతిష్టం‌.అతగాడి కోసం
చెప్పే ప్రతిమాటను ఆమె అందంగా మలచుకుంటుంది..అద్దంలో చూసుకున్నట్టు ఆ మాటలో…
తానూ వుంటుంది.అంతగా పెనవేసుకున్న ప్రేమబంధం ఆ జంటది..అందుకే…ఎక్కడో చినుకు చినుకుగా రాలినా,బిందువు,బింధహదువు సింధువైనట్టు..తనకు తానుగా నదిగా మారి, అతగాడికోసం వెదుకుతుంది..నది సముద్రంలో కలవడానికి పరిగెత్తినట్టు,..సముద్రమంత ప్రేమను తనలో దాచుకున్న అతగాడిలో లీనమయ్యే తాపత్రయం ఆమెది.‌.అంతేకాదు.ఆమె కాస్తంత మృదువైన నెమలీకలా,అతగాడి అడుగుజాడల వెంబడి పరుగులు తీస్తుంది…దొరకతకపోతాడా! అని..ఇప్పుడు ఆమెకో  సంశయం  పట్టుకుంది…ఇంతకూ అతగాడెవరు.ఏ ఆకాశపు తారాతోరణం నుండి జాలువారాడు?ఏమిటీ విడదీయలేనిబంధం.ఏనాటిదీ స్నేహం? ఏపాటిదీ ప్రేమ? ప్రేమలో ఇంత చిక్కదనం, నిరీక్షణలో ఇంత చక్కదనం వుంటుందని ఆమెకు ఇప్పుడే తెలిసింది.‌తన మానస చోరుడిఆనవాళ్ళకోసం అన్వేషిస్తోంది.‌


ప్రేమ ఎంత మధురం అన్న కవికి, ‘ నిరీక్షణ’....
అంతకన్నా మధురమని తెలియదు కాబోలు..!!

*మరో కవిత…!!
*ఒక్కసారి పరికించి చూడు.......
చిక్కని చీకటి
వెలుతురు చిమ్ముతుంది...
నీలి ఆకాశం నేల దిగివచ్చి
మెత్తని తివాచీ అయింది..
చుక్కలు ఒకటి ఒకటిగా
అతిథులుగా విచ్చేసి
నా చుట్టూ చేరి కబుర్లు
చెబుతున్నాయి...
అంతర్వాహిని ఒకటి
చప్పుడు చేయక
చెంత చేరింది ...
సీతాకోకచిలుకల గుంపు
తన రంగులు విదిల్చివెళ్ళింది...
అందరూ
వింతలు విడ్డూరాలు అంటున్నారు
ఏమోయ్.!
నిజం చెప్పు….
నీవు వచ్చి వెళ్లావు కదూ.. !
కొన్ని ఆనవాళ్లు దాచి వెళ్ళింది
ఇక్కడే కదూ…!
      *ఆర్.రమాదేవి.!!


అతడు వస్తూ వస్తూనే వసంతాన్ని వెంటతెస్తాడు. అప్పుడు  సృష్టిలో జరగరాని వింతలన్నీజరుగుతా
యి..ఆ మటకొస్తే, ప్రాకృతిక విరుద్ధమైన అద్భుతాలు కూడా వాటంతటవే జరిగిపోతాయి..అతడంటే ఆషామాషీ కాదు కదా,?
అతడామెమానసచోరుడు. అతడున్నాడన్నది ఎంత నిజమో?లేడన్నది కూడా అంతే నిజం..అతడు భావనాత్ముడు.ఆమె మనసులో
పచ్చి జ్ఞాపకంలామిగిలిపోయాడు.

అతడామెప్రియసఖుడుప్రేమ తడితగిలిన చోటల్లా అతడుంటాడు.అతడున్న చోటల్లాఅద్భుతాలు జరుగుతాయి..!
ఆ అద్భుతాలేమంటే….? *చిక్కని చిమ్మ  చీకటి వెలుతురు చిమ్ముతుంది"( నిజానికిది సాధ్యంకాదు.అయినా
అతడొ స్తే మాత్రం అసాధ్యమేం కాదు.)
*నీలి ఆకాశం నేలకు దిగివచ్చి మెత్తని తివాచీలా పరుచుకుంది" ఎంతో ఎత్తుఅందనంత దూరంలో వుండే ఆకాశం నేలకు
దిగిరావడమేంటి? పిచ్చికాకుంటేను.అసాధ్యమైనా,అతడొస్తే…మాత్రం ఈ పని సుసాధ్యమే..
ఎందుకంటే..
అతడు మామూలు మనిషి కాదు..
ఆమె మనో వల్లభుడు మరి.
*చుక్కలు ఒక్కటొకటిగా,అతిథుల్లా విచ్చేసి,
ఆమె చుట్టూ చేరి కబుర్లు చెబుతాయి"!
ఆకాశంలోని చుక్కలేంటి? కిందకు దిగడమేంటి? అనుకుంటున్నారు కదా!

మీరనుకుంటున్నది నిజమే.. అతడొస్తే ఆమె కాశంలోని చుక్కలు కూడా  నేలకు

దిగొచ్చి తివాచీలా పరుచుకొని అతడి కి స్వాగతం చెబుతాయి.
ఇక…
అతడొచ్చాడో ! లేదో..‌అంతర్వాహిని ఒకటి చప్పుడు చేయక ఆమె చెంత చేరింది …
అంతేనా?
*సీతాకోకచిలుకల గుంపొకటి  వచ్చి రంగులు విదిల్చివెళ్ళింది...దాంతో పరిసరాలన్నీ రంగుల మయమయ్యాయి...అతడికి స్వాగతం చెప్పడానికా ! అన్నట్లు, ఆ సీతాకోకల గుంపుతమ రెక్కల్లోని
రంగుల్ని అక్కడ విదిల్చివెళ్ళాయి.
వీటిని చూసే వారందరూ..ఏమిటీ 'వింతలు'
'విడ్డూరాలు' అంటున్నారట…
అప్పుడామె‌..
తనమనసులో ఇలా అనుకుంది..


" ఏమోయ్….
నిజం చెప్పు….
నీవు వచ్చి వెళ్లావు కదూ.. !
తన మనస్సాక్షి ఎప్పుడూ అబద్ధం కాదు..
ఇదీ…అంతే…!
అవునూ…..
నువ్వొచ్చినప్పుడు…
వచ్చి వెళ్ళిన  'ఆనవాళ్లు' దాచి వెళ్ళింది ఇక్కడే కదూ" అంటూ ఆమె అడిగితే,...
అతగాడి సమాధానం..
"అవుననే "….,
మరంతే కదా..!
అతడే ఒక అద్భుతం..
మరి…
అతడే వచ్చి వెళితే …
అద్భుతాలు జరగవా ఏమీ?


విరోధాభాస ఈ కవితకు అలంకారమైతే…
అతడొచ్చినపుడు జరిగినపరిణామాలు,
అద్భుతాలు..ఆమె ప్రేమకు ఆకారాలు…
అతడొచ్చి వెళ్ళాక మొలిచిన ఆకుపచ్చని శకునాలు..

ప్రేమంటే అంతే మరి….
ఎప్పుడూ…
అదో అద్భుతమే..!!

*ఎ.రజాహుస్సేన్….!!
 


Comments

Post New Comment


No Comments Posted Yet...Write First Comment!!!